టైమ్ ఫిక్స్ చేసిన రేవంత్ రెడ్డి..!

May 13, 2021

కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్‌, టీపీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డి అపోహ‌ల‌కు చెక్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక ప్ర‌చారానికి ఆయ‌న వెళుతున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఆయ‌న ప్ర‌చారం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని మొత్తం ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆయ‌న ప్ర‌చారం కొన‌సాగనుంది. రోడ్ షో ద్వారా ఆయ‌న ప్ర‌చారం చేయ‌నున్నారు.

హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌కు ముందు అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో రేవంత్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మ‌ధ్య అభిప్రాయ బేధాలు వ‌చ్చాయి. ఉత్త‌మ్ ప‌ద్మావ‌తి కోదాడ‌లో గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో ఆమె కోర్టును ఆశ్ర‌యించారు. ఒక‌వేళ కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇస్తే హుజూర్‌న‌గ‌ర్‌లో ఆమె గెలిచినా మ‌ళ్లీ ఉప ఎన్నిక వ‌స్తుంద‌నే ఉద్దేశ్యంతో కొత్త అభ్య‌ర్థిని నిల‌బెడితే బాగుంటుంద‌ని రేవంత్ రెడ్డి ఆలోచించారు.

టీపీసీసీ అధికార ప్ర‌తినిధి చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి అభ్య‌ర్థిత్వాన్ని ప‌రిగ‌ణలోకి తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. అయితే, రేవంత్ రెడ్డి వాద‌న‌తో న‌ల్గొండ జిల్లా నేత‌ల‌ను విభేదించారు. హుజూర్‌న‌గ‌ర్‌లో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి అయితేనే గెలుపు సుల‌భమ‌ని వారు వాదించారు. చివ‌ర‌కు ఆమెకే టిక్కెట్ ద‌క్కింది.

హుజూర్‌న‌గ‌ర్‌లో ఇప్ప‌టికే ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా వివిధ జిల్లాల‌కు చెందిన నేత‌లు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, జానారెడ్డి, దామోద‌ర్ రెడ్డి, శ్రీధ‌ర్ బాబు, జీవ‌న్ రెడ్డి, సీత‌క్క‌, కొండా సురేఖ వంటి నేత‌లు ప్ర‌చారం నిర్వ‌హించారు. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం ప్ర‌చారానికి దూరంగా ఉంటున్నారు. ఆయ‌న త‌న త‌ర‌పున ప్ర‌చారం చేస్తార‌ని ప‌ద్మావ‌తి కూడా చెప్పారు.

చివ‌ర‌కు ఇప్పుడు ఆయ‌న ప్ర‌చారం చేసేందుకు ముహూర్తం ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. చివ‌రి రెండు రోజుల పాటు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ‌మంతా తిరిగి ప్ర‌చారం చేస్తే పార్టీకి కొత్త ఊపు వ‌స్తుంద‌ని, ఎన్నిక‌ల్లో ఎక్కువ ప్ర‌భావం ఉంటుంద‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *