గుహలో 12 మంది చిన్నారులు.. ఆపరేషన్ మొదలైంది

May 14, 2021

థాయ్‌లాండ్‌లోని ఓ గుహలోకి వెళ్లి అక్కడే రెండు వారాలుగా చిక్కుకుపోయిన 12 మంది చిన్నారులు.. వాళ్ల ఫుట్‌బాల్ కోచ్‌ను రక్షించే ఆపరేషన్ మొదలైంది. ఆ చిన్నారులు గుహలోకి వెళ్లిన తర్వాత భారీగా వరదలు రావడంతో వాళ్లు అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. 9 రోజుల తర్వాత వాళ్లను ఇద్దరు బ్రిటిష్ డైవర్లు కనుగొన్నారు. ఇప్పుడు వాళ్లందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో 13 మంది విదేశీ, ఐదుగురు స్వదేశీ డైవర్లు పాలుపంచుకుంటున్నారని చియాంగ్ రాయ్ గవర్నర్ నరోంగ్‌సాక్ వెల్లడించారు.

ఒక్కో చిన్నారి వెనుక ఇద్దరు డైవర్లు ఉంటారని ఆయన చెప్పారు. ఆదివారం ఉదయం పది గంటలకు ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. ఓ వ్యక్తిని బయటకు తీసుకురావడానికి కనీసం 11 గంటలు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ గుహ ఇప్పటికే పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. పైగా చిమ్మచీకటి. ఆక్సిజన్ స్థాయి కూడా పడిపోయింది. నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులను బయటకు తీసుకురావడం చాలా కష్టమైన పని. శుక్రవారం ఈ గుహలోకి వెళ్లిన థాయ్ మాజీ నేవీ సీల్ అధికారి చనిపోయారు.

ఆ చిన్నారులెవరికీ ఈత రాకపోవడంతో ఈ రెస్క్యూ ఆపరేషన్ మరింత క్లిష్టంగా మారింది. అయితే కొన్ని రోజులుగా వాతావరణం చక్కబడటం, గుహలో నీటి మట్టం తగ్గడంతో రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతం చేస్తామన్న నమ్మకం ఉందని గవర్నర్ చెప్పారు. ఈ ఆపరేషన్ మొదలుపెట్టే ముందు గుహ దగ్గరకి వచ్చిన మీడియాను అక్కడి నుంచి పంపించేశారు. జూన్ 23న ఈ గుహలోకి వెళ్లిన ఈ 13 మంది నాలుగు కిలోమీటర్ల లోపల చిక్కుకుపోయారు. అందరు చిన్నారులను బయటకు తీసుకురావడానికి కొన్ని రోజుల సమయం పట్టొచ్చని భావిస్తున్నారు. మరోవైపు గుహలో ఉన్న చిన్నారులు తమ తల్లిదండ్రులకు రాసిన లేఖలు ఇప్పడు బయటకు వచ్చాయి. గుహలోకి వెళ్లి వచ్చిన డైవర్లు ఆ లేఖలను తీసుకొచ్చారు. ఒక్కసారి లోనికి వెళ్లి బయటకు రావడానికి డైవర్లకు 11 సమయం పడుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *