ఏక‌తాటిపైకి ఉద్యోగ సంఘాలు.. ఐక్య ఉద్య‌మాల‌కు సిద్ధం

May 15, 2021

ఉద్యోగ‌, ఉపాధ్యాయ‌, పెన్ష‌న‌ర్ల న్యాయ‌మైన హ‌క్కుల సాధ‌న‌కు ఉద్యోగ సంఘాల‌న్నీ ఏకతాటిపైకి వ‌చ్చి పోరాడాల‌ని ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ స‌మావేశంలో నిర్ణ‌యించింది. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఆధ్వ‌ర్యంలో సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగ‌, ఉపాధ్యాయ‌, పెన్ష‌న‌ర్ల సంఘాల రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. త‌హ‌శీల్దార్ విజ‌యారెడ్డి స‌జీవ ద‌హనం – త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌పై ఈ స‌మావేశంలో చ‌ర్చించారు. వివిధ సంఘాల‌కు చెందిన ఉద్యోగ‌, ఉపాధ్యాయ నేత‌లు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశానికి తెలంగాణ రెవెన్యూ జేఏసీ నాయ‌కులు వి.ల‌చ్చిరెడ్డి అధ్యక్ష‌త వ‌హించారు. వి.ల‌చ్చిరెడ్డి మాట్లాడుతూ… రెవెన్యూ ఉద్యోగులు నిత్యం ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై ప‌ని చేయాల్సి ఉంటుంద‌ని, కానీ విజ‌యారెడ్డి హ‌త్య త‌ర్వాత‌ ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు స్వేచ్ఛ‌గా వెళ్లి ప‌నిచేసే ప‌రిస్థితి లేద‌న్నారు. ఎంతో చ‌రిత్ర క‌లిగిన‌, ప్ర‌జ‌ల‌తో ఉండే రెవెన్యూ శాఖ‌ను నిర్వీర్యం చేస్తున్నార‌ని అన్నారు. రెవెన్యూ ఉద్యోగుల‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని, 58 ల‌క్ష‌ల కొత్త ప‌ట్టాదారు పాస్ పుస్త‌కాలు ఇచ్చాక కూడా రెవెన్యూ ఉద్యోగుల‌ను దోషులుగా ప్ర‌జ‌ల‌కు చూపిస్తున్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌నే రెవెన్యూ ఉద్యోగుల‌కు శ‌త్రువుల‌ను చేస్తున్నార‌ని, రైతులు కాని వారు కూడా ఉద్యోగుల‌ను బెదిరిస్తున్నార‌ని ఆరోపించారు. రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసేందుకు ఈ శాఖ మొత్తం చెడ్డ‌ది అనే ముద్ర వేస్తున్నార‌ని ఆరోపించారు. అన్ని భూస‌మ‌స్య‌ల‌కు రెవెన్యూ ఉద్యోగులే కార‌కుల‌ని చెబుతున్నార‌ని, చ‌ట్టాల్లో ఉన్న గంద‌ర‌గోళం, సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపాలు, ఉద్యోగుల కొర‌త వ‌ల్లనే ఎక్కువ భూస‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల‌న్నీ ఐక్య పోరాటం చేస్తేనే న్యాయ‌మైన హ‌క్కుల‌ను సాధించుకోవ‌చ్చ‌న్నారు. ఇక నుంచి రెవెన్యూ ఉద్యోగ సంఘాల‌ను ప‌క్క‌న‌పెట్టి జేఏసీగానే పోరాడ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఆర్టీసీ జేఏసీ నేత థామ‌స్ రెడ్డి మాట్లాడుతూ… 60 ఏళ్ల స‌మైక్యాంధ్ర పాల‌న‌లోనూ ప‌డ‌న‌న్ని క‌ష్టాలు ఈ ఆరేళ్ల తెలంగాణ‌ రాష్ట్రంలో ప‌డుతున్నామ‌ని అన్నారు. రెవెన్యూ శాఖ ప‌ని చేయ‌క‌పోతే ప్ర‌భుత్వం ప‌ని చేయ‌న‌ట్లేన‌న్నారు. ప్ర‌భుత్వ పెద్ద‌లు నియంత‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఈ చ‌ర్య‌ల‌ను యావ‌త్ ఉద్యోగ లోకం ముక్త‌కంఠంతో ఖండించాల‌న్నారు. తాము భ‌య‌ప‌డ‌మ‌ని, వెన‌క్కు త‌గ్గ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. 26 మంది ఆర్టీసీ కార్మికులు మ‌ర‌ణిస్తే ముఖ్య‌మంత్రి క‌నీసం సానుభూతి తెల‌ప‌లేద‌ని అన్నారు. ఇత‌ర శాఖ‌ల ఉద్యోగులు ఆర్టీసీ కార్మికుల విధులు చేయొద్ద‌ని కోరారు. రెవెన్యూ ఉద్యోగుల పోరాటానికి ఆర్టీసీ కార్మికుల మ‌ద్ద‌తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి మాట్లాడుతూ… ఉద్యోగుల‌పై ప్ర‌భుత్వ వైఖ‌రికి వ్య‌తిరేకంగా ఉద్యోగ‌, ఉపాధ్యాయ‌, కార్మిక సంఘాల‌న్నీ ఐక్యంగా పోరాడాల‌ని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఇత‌ర ఉద్యోగ సంఘాలు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. త‌మ శాఖ‌ల డ్యూటీలు ఇత‌ర శాఖ‌ల వారు చేయొద్ద‌ని కోరారు.

యూటీఎఫ్ నేత సీహెచ్ రాములు మాట్లాడుతూ… తెలంగాణ ఏర్ప‌డ్డాక ఉద్యోగుల‌కు ఏ స‌మ‌స్య‌లూ ఉండ‌వ‌ని కేసీఆర్ చెప్పార‌ని, కానీ ఐదేళ్లుగా ఏ స‌స‌మ్య కూడా ప‌రిష్కారం కాలేద‌న్నారు. గ‌త ముఖ్య‌మంత్రులు ఉద్యోగులు స‌మ్మె చేస్తే పిలిచి మాట్లాడేవార‌ని, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకునేవార‌ని, కానీ కేసీఆర్ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. అన్ని సంఘాలు ఐక్య ఉద్య‌మాలు చేయాల‌ని కోరారు.

జాక్టో(JACTO) నేత జి.స‌దానంద గౌడ్ మాట్లాడుతూ… రెవెన్యూ ఉద్యోగుల ప‌నితీరు బాగుంద‌ని ఒక నెల‌ జీతం ఎక్కువ ప్ర‌క‌టించిన కేసీఆర్ త‌ర్వాత ప్ర‌జ‌ల‌ను రెవెన్యూ ఉద్యోగుల‌పైకి ఉసిగొల్పుతున్నార‌ని ఆరోపించారు. విజ‌యారెడ్డి హ‌త్య‌కు ముఖ్య‌మంత్రి బాధ్య‌త వ‌హించాల‌న్నారు. రెవెన్యూ ఉద్యోగులు భూప‌రిపాల‌న కంటే ఇత‌ర ప‌నులే ఎక్కువ చేస్తున్నార‌ని అన్నారు. ఉద్యోగుల హ‌క్కుల‌పై పోరాడేందుకు కొత్త జేఏసీ ఏర్పడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఎల‌క్ట్రిసిటీ ఉద్యోగుల జేఏసీ నేత మేడి ర‌మేష్ మాట్లాడుతూ… ఏ శాఖ స‌మ‌స్య‌పై ఆ శాఖ ఉద్యోగులు మాత్ర‌మే స్పందిస్తే స‌మ‌స్య ప‌రిష్కారం కాద‌ని, ఉమ్మ‌డి పోరాటం ద్వారా ఇత‌ర శాఖల స‌మ‌స్య‌ల‌పై కూడా స్పందించాల‌న్నారు. రెవెన్యూ ఉద్యోగుల పోరాటానికి త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు.

ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్య‌క్షులు పోచ‌య్య మాట్లాడుతూ… ఉద్య‌మంలో ఉద్యోగుల భాగ‌స్వామ్యం ద్వారా తెలంగాణ వ‌చ్చింద‌ని గుర్తుచేశారు. స‌మైక్య పాల‌కులు కూడా చూప‌ని అణిచివేత‌ను ఇప్పుడు చూపిస్తున్నార‌ని ఆరోపించారు. రెవెన్యూ ఉద్యోగులు భ‌యాందోళ‌న‌లో ఉన్నార‌ని, ఇందుకు ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌లే కార‌ణ‌మ‌న్నారు. పీఆర్‌సీ పేరుతో మ‌ళ్లీ త‌మ‌ను భ్ర‌మ‌ల్లోకి నెట్టేస్తున్నార‌ని అన్నారు. రెవెన్యూ ఉద్యోగుల‌కు త‌మ మ‌ద్దతు ఉంటుంద‌ని, తాడోపేడో తేల్చుకునే వారు వెన‌క‌డుగు వేయొద్ద‌ని సూచించారు.

టీఎస్‌పీటీఏ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చిన్న రాములు మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రికి ఏ వ్య‌వ‌స్థ‌పైనా గౌర‌వం లేద‌న్నారు. ఉద్యోగుల‌పై ప్ర‌భుత్వ వైఖ‌రిని ప్ర‌శ్నించాల‌ని, నిరంకుశాన్ని అడ్డుకోవాల‌న్నారు. రెవెన్యూ ఉద్యోగుల పోరాటానికి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నారు.

టీజీసీటీఏ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య్ కుమార్ మాట్లాడుతూ… ప్ర‌భుత్వం ఒక్కో శాఖ‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తోంద‌ని, ఈ వైఖ‌రిని అన్ని శాఖ‌ల ఉద్యోగులు క‌లిసి ఎదుర్కోవాల‌న్నారు. ప‌దేప‌దే సంఘాల నాయ‌కుల‌ను విల‌న్లుగా ప్ర‌భుత్వం చూపిస్తోంద‌ని, కానీ ఈ నాయ‌కులే ఉద్యోమంలో ఉద్యోగుల‌ను భాగ‌స్వాముల‌ను చేశార‌ని గుర్తు చేశారు.

టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్య‌ద‌ర్శి చావ ర‌వి మాట్లాడుతూ… అసెంబ్లీలో సీఎం ప్ర‌క‌ట‌న త‌ర్వాత రెవెన్యూ ఉద్యోగుల‌పై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం పెరిగింద‌ని, వారిపై దాడుల‌కు సీఎం బాధ్య‌త వ‌హించాల‌న్నారు. స‌మైక్యాంధ్ర‌లో ఆత్మ‌గౌర‌వంతో కొట్లాడి హ‌క్కులను సాధించుకున్న ఉద్యోగ సంఘాల్లో ఐక్య‌త కొర‌వడ‌టం ప్ర‌ధాన కార‌ణ‌మ‌న్నారు. రెవెన్యూ జేఏసీకి త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో రెవెన్యూ జేఏసీ నేత‌లు వి.ల‌చ్చిరెడ్డి, ఎస్‌.రాములు, గ‌రికె ఉపేంద‌ర్‌రావు, ఎన్‌.ల‌క్ష్మీనారాయ‌ణ‌, వంగూరు రాములు, సుధాక‌ర్‌రావు, బి.సుద‌ర్శ‌న్‌

రెవెన్యూ జేఏసీ భ‌విష్య‌త్‌ కార్య‌చ‌ర‌ణ‌
రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ భ‌విష్యత్‌ కార్య‌చ‌ర‌ణ‌ను రౌండ్ టేబుల్ స‌మావేశంలోనే ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది.

13-11-2019, 14-11-2019 తేదీల్లో ఉద్యోగుల పెన్‌డౌన్‌

14-11-2019న‌ రెవెన్యూ ఉద్యోగుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ప్ర‌జాప్ర‌తినిధులకు విన‌తిప‌త్రాలు

15-11-2019న అన్ని రెవెన్యూ కార్యాల‌యాల్లో వంటా-వార్పు

16-11-2019 నుంచి భూసంబంధ విధుల బ‌హిష్క‌ర‌ణ‌

ప్రాంతీయ స‌ద‌స్సులు
16-11-2019న ఖ‌మ్మంలో ఉమ్మ‌డి ఖ‌మ్మం, న‌ల్గొండ‌, వ‌రంగ‌ల్ జిల్లాల రెవెన్యూ ఉద్యోగుల స‌ద‌స్సు

19-11-2019న కామారెడ్డిలో ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్‌, అదిలాబాద్‌, నిజామాబాద్‌, మెద‌క్ జిల్లాల రెవెన్యూ ఉద్యోగుల స‌ద‌స్సు

22-11-2019న హైద‌రాబాద్‌లో ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, రంగారెడ్డి, హైద‌రాబాద్ జిల్లాల రెవెన్యూ ఉద్యోగుల స‌ద‌స్సు

ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌లో 30 వేల మంది రెవెన్యూ ఉద్యోగుల‌తో సింహ‌గ‌ర్జ‌న స‌భ హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *