నిర్భయ కేసులో తుదితీర్పు రేపు

May 15, 2021

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ లైంగిక దాడి కేసులో నలుగురు దోషులకు సుప్రీంకోర్టు మరణశిక్షను ఖరారు చేస్తుందా? లేక జీవితఖైదుగా మారుస్తుందా? అనే అంశం సోమవారం వెల్లడికానుంది. వైద్య విద్యార్థిని అయిన 23 ఏళ్ల యువతిపై 2012, డిసెంబర్ 16న ఢిల్లీలో నడుస్తున్న బస్సులో ఆరుగురు మృగాళ్లు దారుణంగా లైంగికదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే (తీవ్ర గాయాలపాలైన యువతి ఆ తర్వాత మరణించారు). వీరిలో డ్రైవర్ రామ్‌సింగ్ జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా, మైనర్ అయిన బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. నిర్భయ సంఘటన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రజలు వేలసంఖ్యలో రోడ్లెక్కి నిరసన తెలిపారు. దీంతో ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటుచేసి విచారణను వేగవంతం చేసింది. నిర్భయపై లైంగికదాడికి పాల్పడిన ముఖేశ్, పాశ్వాన్, వినయ్‌శర్మ, అక్షయ్‌కుమార్‌సింగ్‌లను దోషులుగా నిర్ధారిస్తూ ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించాయి. అయితే, తమ శిక్షను జీవితఖైదుకు తగ్గించాలంటూ ఇద్దరు నిందితులు గత ఏడాది నవంబరులో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మే 5న ఈ కేసులో ఇరువురి వాదనలు విన్నది. అనంతరం తన తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసులో సోమవారం సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించనున్నది.

One thought on “నిర్భయ కేసులో తుదితీర్పు రేపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *