ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థి అనుమాస్పద మృతి

May 15, 2021

కర్నూల్‌ మెడికల్‌ కాలేజీ హాస్టల్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్‌ మొదటి సంత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ఆర్‌ జిల్లా కడప అరవింద్‌ నగర్‌కు  చెందిన హర్ష ప్రణీత్‌ రెడ్డి కర్నూలు మెడికల్‌ కాలేజీలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. గురువారం రాత్రి 11.30 నిమిషాలకు తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకొన్నాడు. అయితే కొద్ది సేపటికి సహచర విద్యార్ధులు వచ్చి డోర్‌ కొట్టగా హర్ష స్పందించక పోవడంతో అనుమానం వచ్చి బద్దలు కొట్టారు. చలనం లేకుండా పడివున్న మిత్రుడిని హాస్పిటల్‌కు తరలించి కళాశాల యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే హర్ష మరణించినట్లు వైద్యులు తెలిపారు.

హర్ష ప్రణీత్‌ మృతిపై తండ్రి రామాంజుల రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు శరీరంపై రక్తపు మరకలు ఉన్నాయని, ఎవరో కొట్టి చంపారని ఆరోపించారు. గతంలో చాలాసార్లు కాలేజీలో ర్యాగింగ్‌ చేస్తున్నట్లు తనతో చెప్పాడని, కానీ ఇవన్నీ మామూలే అని నచ్చచెప్పి బాగా చదువుకోమని చెప్పానని ఆయన అన్నారు. పరీక్షలకు భయపడి ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని, ర్యాగింగ్‌ చేసి తన కుమారుడిని పొట్టన పెట్టుకున్నారని కన్నీరు మున్నీరు అయ్యారు. గారాబంగా పెంచుకున్న కుమారుడు చనిపోతే కాలేజీ యాజమాన్యం, సిబ్బంది కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *