నేటి నుంచి అత్యవసరాల రవాణా బంద్‌

May 13, 2021

నాలుగు రోజులుగా కొనసాగుతున్న లారీల సమ్మె రవాణా రంగంపై తీవ్రప్రభావం చూపింది. ఎక్కడ లారీలు అక్కడే ఆగిపోయాయి. ఇప్పటి వరకు నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్, మందులు, ఇతర అత్యవసర సరుకుల రవాణాకు మినహాయింపు నిచ్చారు. అయితే మంగళవారం నుంచి అత్యవసర సరుకుల రవాణాను సైతం  నిలిపేసే విధంగా లారీల యజమానులు చర్చలు జరుపుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 5 లక్షలకు పైగా లారీలున్నాయి. ఏపీలో 3 లక్షల వరకు లారీలు ఉన్నాయి. 13 జిల్లాల్లో కలిపి గత నాలుగు రోజుల నుంచి 2.80 లక్షలు లారీలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. లారీల యజమానులు నిరవధిక బంద్‌ కొనసాగిస్తున్నా.. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏపీ వరకు బంద్‌ కారణంగా ప్రభుత్వానికి రోజుకు రూ.25 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా వేస్తున్నారు. లారీ యజమానులు రూ.30 నుంచి రూ.40 కోట్లు నష్టపోతున్నట్లు అంచనా. నాలుగు రోజుల నుంచి లారీల నిరవధిక బంద్‌తో ఏపీలో రూ.వెయ్యి కోట్ల లావాదేవీలు ఆగిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *