కోర్టు ధిక్కరణకు పాల్ప‌డిన న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు శిక్ష ఖ‌రారు

May 13, 2021

సుప్రీంకోర్టు జడ్జిలపై వివాదాస్ప‌ద ట్వీట్లు చేస్తూ… కోర్టు ధిక్కరణకు పాల్పడిన న్యాయ‌వాది ప్రశాంత్‌ భూషణ్‌కు భారత‌ అత్యున్నత న్యాయస్థానం సోమ‌వారం శిక్షను ఖరారు చేసింది. ప్రశాంత్‌ భూషణ్‌కు ఒక్క రూపాయి జరిమానా విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్‌ 15లోగా ఒక్క‌ రూపాయిని కోర్టుకు డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. ఒక‌వేళ డిపాజిట్‌ చేయకపోతే 3 నెలల జైలుశిక్ష , మూడేళ్లపాటు ప్రాక్టీస్‌ చేయకుండా నిషేధం విధిస్తామని తీర్పులో హెచ్చరించింది.

న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్ జూన్‌ 27న నలుగురు సుప్రీం కోర్టు మాజీ సీజేల పనితీరును తప్పుబడుతూ ట్వీట్ చేశారు. 29న ప్రస్తుత చీఫ్‌ జస్టిస్‌  బోబ్డే లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారని… ఓ పార్టీ నాయకుడి బైకు నడిపారని ఆరోపిస్తూ మ‌రో ట్వీట్ చేశారు. ఈ రెండు ట్వీట్లు వివాదాస్పదం కావ‌డంతో సుప్రీంకోర్టు ట్వీట్ల‌ను సుమోటోగా స్వీక‌రించి… న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూషణ్ పై కోర్టుధిక్క‌ర‌ణ‌ కేసు న‌మోదు చేసింది.

ఆగ‌స్టు 14న ప్ర‌శాంత్ భూష‌ణ్ ను దోషిగా ప్ర‌క‌టిస్తూ సుప్రీంకోర్టు నిర్ణ‌యించింది. అనంత‌రం వివాదాస్ప‌ద‌ ట్వీట్ల‌పై క్ష‌మాపణ చెప్పాల‌ని నాలుగు రోజుల గ‌డువు ఇచ్చింది. అయితే ప్ర‌శాంత్ భూష‌ణ్ మాత్రం క్ష‌మాప‌ణ చెప్పేందుకు నిరాక‌రించారు. దీంతో ఆగ‌స్టు 25న తీర్పును రిజ‌ర్వు చేసిన సుప్రీంకోర్టు సోమ‌వారం శిక్ష‌ను ఖ‌రారు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *