ఫేస్‌బుక్‌లో ప్రకటన.. రూ.లక్షల్లో వంచన

May 15, 2021

తక్కువ ధరకు బంగారు నగలను విక్రయిస్తున్నట్లు ఫేస్‌బుక్‌లో నగల చిత్రాలను పెట్టి మహిళలను మోసం చేస్తున్న వ్యక్తిని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.3.90లక్షల నగదు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా వేంకటేశ్వరకాలనీకి చెందిన కుమ్మరి లక్ష్మణ్‌(39) పలు హాస్టళ్లలో మూడేళ్లు పనిచేసి తర్వాత సొంతంగా ఓ హాస్టల్‌ను నెలకొల్పి నష్టాల పాలయ్యాడు. సులువుగా డబ్బు సంపాదించాలని పథకం పన్నాడు. తన ఫేస్‌బుక్‌ ఖాతాలో బంగారు అభరణాలను తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఆభరణాల చిత్రాలను ఉంచి ఫోన్‌ నంబరు పోస్ట్‌ చేశాడు.

నగరానికి చెందిన గాయత్రి అనే మహిళ ఆ ప్రకటన చూసి ఫోన్‌ చేయగా అహ్మదాబాద్‌లో తక్కువధరకే నగలు లభిస్తాయని ఆమెను నమ్మించాడు. ఆ ఆభరణాలను రూ.6లక్షలకు విక్రయించేందుకు ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈనెల 5న రూ.4లక్షలు ఆన్‌లైన్‌ ద్వారా అతడికి పంపించి, అతడి సూచనల మేరకు ఆమె అహ్మదాబాద్‌కు వెళ్లింది. అతడు ఇచ్చిన ఫోన్‌నెంబరు పనిచేయకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి, బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. దర్యాప్తు నిమిత్తం బంజారాహిల్స్‌ పోలీసులకు నిందితుడిని అప్పగించారు. నిందితుడిని పట్టుకున్న ఎస్సైలు శ్రావణ్‌కుమార్‌, కేఎస్‌ రవి, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీకాంత్‌లను డీసీపీ అభినందించి రివార్డులు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *