ఖాళీ కడుపుతో తింటేనే.. ఫల పలితం..

May 15, 2021

మనం సహజంగా పండ్లను ఏ విధంగా తింటాం.. చాలా వరకు భోజనం చేసిన తర్వాతనే కదా.. అంతేకాదు, మన ఊళ్ళలో అమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు రుచి కోసం పెరుగున్నంలో మామిడిపండు, అరటి పండు వంటివి కలిపి తినిపిస్తుంటారు. కానీ ఇలా తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఈ మధ్య కనుగొన్నది కాదు, దశబ్దాల క్రితమే ప్రయోగాలు చేసి నిరూపించిన అక్షర సత్యం. అంతేకాదు, పరగడుపున లేదా ఖాళీ కడుపుతో , సాయంత్రం డిన్నర్ లోపండ్లు, పండ్ల రసాలు తీసుకుంటే చాలా రకాల అనారోగ్యాలు దూరమవుతాయని చెబుతున్నారు.

తినాల్సిన తీరు..
పండ్లను తినడం అంటే.. మార్కెట్‌కు వెళ్ళి మనకు నచ్చిన పండ్లను కొనుక్కొని వచ్చి, శుభ్రంగా కడిగి కట్‌ చేసి తినడమే కదా అనుకుంటాం. కానీ అది అనుకున్నంత సులువు కాదు. పండ్లను తినడం ఎప్పుడు ఎలా అనేది చాలా ప్రధానం.

*సరైన పద్ధతి ఏంటి?

భోజనం తర్వాత పండ్లను తినడం ఆరోగ్య హితం కాదు. పండ్లను ఖాళీ కడుపుతోనే తినాలి. ఎందుకంటే.. ఖాళీ కడుపుతో తినే పండ్లు జీర్ణవ్యవస్థ విషతుల్యం కాకుండా రక్షిస్తాయి. శరీరానికి కావాల్సిన శక్తిని అందించి, బరువు పెరగకుండా మేలు చేస్తాయి.

పండ్లు ముఖ్యమైన ఆహారం..
మనం ఇరత ఆహారంతో పండ్లను తీసుకుంటే పూర్తి స్థాయిలో జీర్ణం అవడంలో అవరోధాలు ఏర్పడతాయి. ఇది శరీరానికి మేలు చేయదు. పండును మరో పదార్థంతో కలిపి తినడం వల్ల గ్యాస్‌ ఉత్పత్తి అయి, పొట్ట అంతా గందరగోళమవుతుంది. పండ్ల ముక్కలుగా, జ్యూస్‌గా తీసుకుంటే ఆహారాన్ని జీర్ణం చేసేందుకు అవసరమైన యాసిడ్‌లను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి పండ్లను ఖాళీ కడుపుతోనే తినాలి. లేదంటే భోజనానికి కొంత సమయం ముందు తినాలి. పండ్లను సరైన పద్ధతిలో తింటే, అందం, ఆయుష్షు, ఆరోగ్యం, శక్తి, సంతోషం, సాధారణ బరువు వంటివి మన సొంతమవుతాయి. పండ్ల రసాలు తాగాలనుకుంటే, తాజా పండ్ల రసాలను మాత్రమే తాగాలి. పాకెట్లలో, బాటిళ్ళలో అందుబాటులో ఉండే వాటిని తాగొద్దు.

ఏర్పడే సమస్యలు..
చాలా మంది అనేక రకాలుగా ఫిర్యాదులు చేస్తుంటారు. ‘నేను పుచ్చకాయ తినగానే కడుపులో నుంచి గాలి నోటి ద్వారా బయటకు వస్తోంది, పనస పండు తినగానే నా పొట్ట ఎత్తుగా అయింది, అరటిపండు తినగానే బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి వస్తోంది’ వంటివి సర్వసాధారణంగా వినిపిస్తుంటాయి. కానీ ఖాళీ కడుపుతో పండ్లు తింటే ఇలాంటి సమస్యలు దరిచేరవు.

ఎన్నో పరిశోధనల ఫలితంగా..
డాక్టర్‌ స్టీఫెన్‌ మాక్‌ క్యాన్సర్‌ బాధితులను ఒక పద్ధతిలో బాగు చేశారు. సహజ వైద్యాన్ని ఉపయోగించి అనారోగ్యాలను నయం చేశారు. ‘క్యాన్సర్‌ను బాగు చేయడంలో దాదాపు 80 శాతం విజయం సాధించాను. రోజు పండ్లు తింటే క్యాన్సర్‌ బాధితులు కోలుకుంటారు’ అని ఆయన వెల్లడించారు. డాక్టర్‌ హెర్బెర్ట్‌ హెల్టాన్‌ చేసిన పరిశోధనలు నిమ్మ, నారింజ వంటి పండ్లు ఆమ్లత్వం కలిగినవి కాదు, అవి మన పొట్టలోనే ఆల్కలీన్‌గా మారతాయని నిరూపించాయి.

వేడిచేసిన పానీయాలను తాగొద్దు..
ఉడికించిన పండ్లను తినకూడదు. ఎందుకంటే వాటిలో ఉండే సహజత్వం, పోషకాలు వేడిచేసిన తర్వాత ఉండవు. వండే క్రమంలో వాటిలోని విటమిన్లు కనుమరుగవుతాయి. రుచి మాత్రమే పొందగలు గుతాం. రసాలు తయారు చేసుకోవడం కంటే, పండును నేరుగా తినడం ఇంకా ఉత్తమం. తాజా పండ్ల రసాలు తాగేపుడు మెల్లగా తాగాలి. నోటిలో ఉండే లాలాజలాన్ని కూడా కలిపి మింగడం వల్ల ఉపయోగం ఉంటుంది. తాజా పండ్లను తీసుకుంటే శరీరంలో ఉండే విషతుల్యాలన్నీ విసర్జితమై, చర్మం కాంతులీనుతుందని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.

*కివీ పండు : చూడడానికి చిన్నదైనప్పటికీ చాలా శక్తివంతమైనది. దీనిలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్‌ ఇ, ఫైబర్‌ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్‌ సి రెండు నారింజ పండ్లతో సమానం.
*యాపిల్‌: రోజుకో యాపిల్‌ తినడం వల్ల డాక్టర్‌ అవసరం ఉండదని నానుడి ఉంది. యాపిల్‌లో యాంటి ఆక్సిడెంట్‌ గుణం ఎక్కువగా ఉంటుంది. ఇది పెద్దపేగుకు వచ్చే క్యాన్సర్‌, గుండె పోటు ముప్పు నుంచి కాపాడుతుంది. ఇవి తాజగా ఉన్నపుడు తినడమే ఉపయోగకరం.

*స్ట్రాబెర్రీ : మన శరీరాన్ని రక్షించే పండని చెప్పవచ్చు. ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే యాంటి ఆక్సిడెంట్‌ శరీరాన్ని క్యాన్సర్‌ నుంచి కాపాడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది.

*నారింజ : తియ్యని మందని చెప్పవచ్చు. రోజూ 2 నుంచి 4 నారింజలు తీసుకుంటే జలుబు దరి చేరదు. తక్కువ కొలెస్ట్రాల్‌ ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు రాకుండా కాపాడుతుంది. పెద్దపేగుకు క్యాన్సర్‌ ముప్పును దరిచేరనీయదు.

*పుచ్చకాయ : చల్లగా ఉండడంతో పాటు దాహం తీర్చే గుణం కలిగి ఉంటుంది. దీనిలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచే గ్లూటాథియోన్‌ అనే యాంటి ఆక్సిడెంట్‌తో నిండి ఉంటుంది. అంతేకాదు, క్యాన్సర్‌తో పోరాడే లైసోపిన్‌ ఆక్సిడెంట్‌ ఉంటుంది. దీనితో పాటు విటమిన్‌ సి, పొటాషియం వంటి పోషకాలను ఉన్నట్టు గుర్తించారు.

*జామ, బొప్పాయి: ఈ రెండింటిలోనూ విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. జామలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని దరి చేరనీయదు. బొప్పాయిలో కెరోటిన్‌ అధికంగా ఉంటుంది. ఇది కండ్లకు మేలు చేస్తుంది.

సుగుణారావు
సిద్దార్థ యోగ విద్యాలయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *