స్నేహం ముసుగులో.. సైబర్ నేరగాళ్లు

May 15, 2021

స్నేహం పేరుతో సైబర్ మోసగాళ్లు ఓ ఫిజియోథెరపి డాక్టర్‌ను బురిడీ కొట్టించారు. ఏకంగా రూ. 8.5 లక్షలు కాజేశారు. నగరంలోని మెహిదీపట్నంకు చెందిన ఫియోథెరపి డాక్టర్ ఫజల్ ఇటీవల టూ అనే మొబైల్ అప్లికేషన్‌ను తన సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఆ యాప్ ద్వారా బ్రిటన్‌కు చెందిన ఒక యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరు కొన్నాళ్లు చాటింగ్ చేశారు. తన పేరు అల్యా అని తల్లి భారతీయురాలని, తండ్రి సింగపూర్‌కు చెందిన వాడని, నేను భారతదేశంలో వ్యాపారం చేయాలని అనుకుంటున్నానంటూ తన వ్యాపార కాంక్షను తెలియజేసింది.

స్నేహానికి గుర్తుగా అంటూ

వ్యాపారానికి సంబంధించిన కొన్ని ప్రపోజల్స్ ఇద్దరు ఈమెయిల్స్ ద్వారా చర్చించుకున్నారు. ఈ క్రమంలో మన ఫ్రెండ్‌షిప్ గుర్తుగా నీకు మంచి బహుమతి పంపిస్తున్నానంటూ నమ్మించింది. పంపించే బహుమతుల పార్శిల్‌లో గోల్డ్ రింగ్, డైమాండ్ నెక్లెస్, ఐఫోన్, ల్యాప్‌టాప్‌లు ఉన్నాయని, వాటి ఫోటోలను కూడా పంపించింది. రెండు రోజుల తరువాత మీ పేరుతో ఒక పార్శిల్ వచ్చిందని, అందులో విలువైన వస్తువులు ఉన్నాయని, వాటిని కస్టమ్స్ క్లియెర్ చేసుకోవాలంటూ కస్టమ్స్ అధికారులుగా కొందరు ఫోన్ చేశారు. దాంతో పాటు అందులో చాల డాలర్లు ఉన్నాయని, డాలర్లను అలా పార్శిల్ చేయడానికి వీలు లేదంటూ భయపెట్టారు. దీంతో ఫజల్ ఆమెకు ఫోన్ చేశాడు. అవును నిజమే అందులో 80 వేల డాలర్లు ఉన్నాయని, నిన్ను ఆశ్చర్యానికి గురిచేసేందుకు ఆ విషయం ముందుగా చెప్పలేదంది. దీంతో కస్టమ్స్, ఆర్‌బీఐ క్లియెరెన్స్, యాంటీ టెర్రరిస్ట్ సర్టిఫికేట్ అంటూ దఫ దఫాలుగా సైబర్ చీటర్లు ఫజల్ వద్ద నుంచి రూ. 8.5 లక్షలు వివిధ ఖాతాలలో డిపాజిట్ చేయించారు. ఇంకా డబ్బు క్లియరెన్స్‌ల కోసం అడుగుతుండడంతో అనుమానం వచ్చి సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని ఇన్స్‌పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *