ఉన్నావ్ అత్యాచారం కేసులో సీబీఐ చార్జిషీటు

May 13, 2021

ఉన్నావ్ అత్యాచారం కేసులో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. సీబీఐ అధికారులు శనివారం ఐదుగురు నిందితులపై చార్జిషీటు దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో 4 జూన్, 2017న 17 ఏండ్ల బాలిక అత్యాచారానికి గురైన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతడు ప్రస్తుతం సీతాపూర్ జైలులో ఉన్నాడు. ఎమ్మెల్యే సోదరుడు అతుల్‌సింగ్ సెంగార్ కూడా కేసులో మరో నిందితుడిగా ఉన్నాడు. బాధితురాలి తండ్రి జ్యూడిషియల్ కస్టడీలో ఉండగా మృతిచెందాడు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఏప్రిల్ 13న అత్యాచార ఆరోపణలతో బీజేపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 363(కిడ్నాప్), సెక్షన్ 366( మహిళను అపహరించడం), సెక్షన్ 376(అత్యాచారం), సెక్షన్ 506(ఉద్దేశపూర్వక నేర ప్రవృత్తి) కింద కేసులు నమోదయ్యాయి. కాగా ఎఫ్‌ఐఆర్ వాపసు తీసుకోవడానికి నిరాకరించిన కారణంగా బెదిరింపులకు గురిచేస్తూ ఎమ్మెల్యే సోదరుడు అతుల్‌సింగ్ సెంగార్ అతని అనుచరులతో కలిసి మరోసారి బాధిత బాలికను అత్యాచారం చేశాడు. అంతేకాకుండా బాలిక తండ్రిని తీవ్రంగా హింసించాడు. అనంతరం బాలిక తండ్రి జ్యూడిషియల్ కస్టడీలో చనిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *