బ్రౌన్ రైస్ తింటే మంచిదేనా..?

May 14, 2021

ప్రస్తుత తరుణంలో మనం పాలిష్ చేసిన బియ్యాన్నే ఎక్కువగా తింటున్నాం. కానీ అది మంచిది కాదు. మన పూర్వీకులు దంపుడు బియ్యాన్నే తినేవారు. అందుకని వారికి అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా వచ్చేవి. పాలిష్ చేసిన బియ్యాన్ని తింటుండడం వల్ల అనేక అనారోగ్యాలకు గురి కావల్సి వస్తున్నది. అయితే వాటికి బదులుగా బ్రౌన్ రైస్ (ముడి బియ్యం) తిని చూడండి. తేడా మీకే తెలుస్తుంది. ముడి బియ్యం తినడం వల్ల అనేక పోషకాలు అందడంతోపాటు పలు అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ముడి బియ్యం తినడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. డయాబెటిస్ ఉన్నవారికి ముడిబియ్యం ఎంతగానో మేలు చేస్తాయి. అందులో ఉండే ఫైటిక్ యాసిడ్, ఫైబర్, పాలిఫినాల్స్, సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్లు రక్తంలోకి గ్లూకోజ్ విడుదలయ్యే ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ వెంటనే పెరగవు. తద్వారా డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

2. ఎముకలను దృఢంగా ఉంచేందుకు బ్రౌన్ రైస్ పనికొస్తుంది. ఎముకల ఆరోగ్యానికి ఈ బియ్యం ఎంతగానో ఉపయోగపడ‌తాయి.. బ్రౌన్ రైస్‌లో మెగ్నిషియం, కాల్షియంలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి.

3. రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ఉండాలంటే బ్రౌన్ రైస్ తినాలి. ఇందులో ఉండే సెలీనియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. హైబీపీ తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది.

4. ముడి బియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జీర్ణ సమస్యలు ఉండవు. దీంతోపాటు తిన్న ఆహారం సులభంగా, త్వరగా జీర్ణమవుతుంది.

5. అధిక బరువును తగ్గించుకునేందుకు కూడా బ్రౌన్ రైస్ పనికొస్తుంది. ఇందులో ఉండే పాస్ఫరస్ మన శరీరంలో ఉండే కొవ్వును కరిగిస్తుంది. దీని వల్ల బరువు అదుపులో ఉంటుంది. అలాగే ఆకలిపై నియంత్రణ వస్తుంది. దీంతో ఆహారం తినాలనే యావ ఎక్కువగా ఉండదు. ఫలితంగా బరువు తగ్గుతారు.

6. రోజూ బ్రౌన్ రైస్ తినడం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.

7. బ్రౌన్ రైస్‌లో సమృద్ధిగా ఉండే మెగ్నిషియం శరీరానికి కావల్సిన శక్తిని ఇస్తుంది. దీంతో ఎక్కువ సేపు పని చేసినా అలసట, నీరసం రావు. చురుగ్గా కూడా ఉంటారు.

8. రోజూ బ్రౌన్ రైస్ తినే వారికి పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశం 13 శాతం వరకు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *