నటీమణులతో స్టార్‌ హోటళ్లలో వ్యభిచార దందా

May 15, 2021

రాజధానిలోని స్టార్‌ హోటళ్లు అడ్డాగా నటీమణులను ట్రాప్‌ చేసి వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా నడిపించే జనార్దన్‌రావు అలియాస్‌ జానీ నగర పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నాడు. శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ స్టార్‌ హోటల్‌పై దాడి చేసిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. విటుడిగా వచ్చిన ఆర్మీ లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ను సైతం పట్టుకొని, భోజ్‌పురి నటిని రెస్క్యూ చేశారు. గతేడాది డిసెంబర్‌లోనూ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం బంజారాహిల్స్, పంజగుట్ట పరిధుల్లో రెండు స్టార్‌ హోటళ్లపై ఏక కాలంలో దాడులు చేసింది. ఇద్దరు పాత్రధారుల్ని అరెస్టు చేసి తెలుగు సినీ, బెంగాలీ టీవీ రంగాలకు చెందిన ఇద్దరు నటీమణుల్ని రెస్క్యూ చేసింది. ఈ కేసులోనూ జానీ వాంటెడ్‌గా ఉన్నాడు. సినీ అవకాశాల పేరుతో వర్ధమాన తారలను ట్రాప్‌ చేసే జానీ… వారి ఫొటోలను వాట్సప్‌లో విటులకు షేర్‌ చేసి, స్టార్‌ హోటళ్లలో దందా నడిపించేవాడు.

అవకాశాల పేరుతో ట్రాప్‌…  
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన జానీ సిటీలోని పద్మారావునగర్‌లో స్థిరపడ్డాడు. 2010 నుంచి స్టార్‌ హోటల్స్‌ అడ్డాగా నటీమణులతో వ్యభిచార దందా చేస్తూ మూడుసార్లు పోలీసులకు చిక్కాడు. ఇతడిపై బంజారాహిల్స్, పంజగుట్ట, చందానగర్‌ తదితర ఠాణాల్లోనూ కేసులు ఉన్నాయి. మరికొన్ని కేసుల్లోనూ మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన డి.వెంకట్‌రావు, మోనిష్‌లను సహాయకుడిగా ఏర్పాటు చేసుకొని స్టార్‌ హోటల్స్‌ కేంద్రంగా వ్యభిచార దందాలు నిర్వహించాడు. డిసెంబర్‌లో మిగిలిన ఇద్దరూ దొరికినా జానీ మాత్రం చిక్కలేదు. తెలుగు, హిందీ, భోజ్‌పురి, బెంగాలీ సినీ రంగానికి చెందిన వర్ధమాన హీరోయిన్లతో పాటు కొందరు టీవీ ఆర్టిస్టులనూ ముంబై, కోల్‌కతాల నుంచి రప్పిస్తుంటాడు. సినిమాల్లో అవకాశాల పేరుతో ఇక్కడకు తీసుకొచ్చిన తర్వాత వారిని వ్యభిచార ఊబిలోకి దింపి తన సహాయకులతో కథ నడిపిస్తుంటాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *