సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి సంతకం ఫోర్జరీ

May 15, 2021

తనకు తెలంగాణ సచివాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చిందంటూ ఓ మహిళ నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్‌తో శనివారం సాయంత్రం సచివాలయానికి వచ్చింది. అయితే అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లో ఉన్న సంతకం ఏకంగా ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డి పేరుతో ఫోర్జరీ అయి ఉండడంతో అక్కడున్న అధికారులు షాక్‌కు గురయ్యారు. దీంతో ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి దృష్టికి అధికారులు తీసుకెళ్లడంతో ఆయన వెంటనే ఈ విషయంపై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. దీంతో సీఎస్ కార్యాలయం సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు సైఫాబాద్ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం… విజయవాడకు చెందిన ఎస్.నాగమణి (28) తల్లితో కలిసి కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నది. బీకాం వరకు చదివిన ఆమె ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమం లో 2014లో ఓ మహిళ ద్వారా ఆమె తల్లికి పరిచయమైన అదే ప్రాంతంలో నివాసముండే బి. ప్రేమ్‌సాగర్ పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో తన కూతురుకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలంటూ ఆమె కోరింది. దీంతో తనకు రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయిలో చాలా పరిచయాలు ఉన్నాయని, రెవెన్యూ శాఖలో ఉద్యోగం కల్పిస్తానని, అందుకు కొంత ఖర్చవుతుందని నమ్మించాడు.

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించడంతో.. తాము డబ్బులు ఇస్తామని నాగమణి తల్లి ఒప్పుకుంది. సుమారు మూడేళ్ల పాటు నాగమణి కుటుంబ సభ్యుల నుంచి ఉద్యోగం కోసమంటూ దఫదఫాలుగా సుమారు రూ.6లక్షల వరకు ప్రేమ్‌సాగర్ తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో నాగమణి కుటుంబ సభ్యులు ప్రేమ్‌సాగర్‌ను నిలదీయడం ప్రారంభించారు. దీంతో సచివాలయంలోని రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టు సిద్ధ్దంగా ఉందని, అందుకు సంబంధించిన అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇప్పిస్తానంటూ నమ్మించాడు. దీంతో రెండు రోజుల క్రితం నాగమణి పేరుతో ఓ నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్‌ను తయారు చేశాడు. దానిపై ముఖ్యమంత్రి కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి సంతకం పెట్టినట్లుగా ఫోర్జరీ సంతకాన్ని పెట్టి ఆమెకు అందించాడు. దీంతో ఆమె శనివారం రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు అపాయింట్‌మెంట్ ఆర్డర్ వచ్చిందంటూ సచివాలయం అధికారులను కలిసింది. దీంతో తాను మోసపోయానని, తనకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ ప్రేమ్‌సాగర్ మోసం చేశాడంటూ ఆమె అధికారులకు విన్నవించింది. దీంతో ఆమె సైఫాబాద్ పోలీసులు ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఘరానా ఛీటర్ ప్రేమ్‌సాగర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నాగమణి ఒక్కరే బాధితురాలా? మరింత మంది ఉన్నారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రేమ్‌సాగర్‌పై పోలీసులు వివరాలు ఆరా తీయడంతో ఇలా పలు మోసాలకు పాల్పడుతున్నాడని ప్రాథమికంగా పోలీసులు ధ్రువీకరించారు. దీంతో ఈ ఘరానా మోసగాడి కోసం గాలింపు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *