శిశువు కిడ్నాప్‌ కథ సుఖాంతం

May 15, 2021

 రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన శిశువు కిడ్నాప్‌ కథ ఎట్టకేలకు సుఖాంతం అయింది. కిడ్నాప్‌ చేసిన మహిళ శిశువును టవల్‌లో చుట్టి బీదర్‌ ప్రభుత్వ ఆస్పత్రి వరండాలో పడుకోబెట్టి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి వైద్యులతో మాట్లాడి చికిత్స అందించాలని కోరారు. శిశువు ఆరోగ్యంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సుల్తాన్‌ బజార్‌ ఏసీపీ డాక్టర్‌ చేతన కంప్యూటర్‌లోని స్కైప్‌ ద్వారా శిశువును తల్లిదండ్రులకు చూపించగా తమ అమ్మాయే అని గుర్తించారు.

రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన ఎస్‌. నరి, విజయ(25) భార్యాభర్తలు. గతనెల 21వ తేదీన రెండో ప్రసవం కోసం ఆమె సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రికి కుటుంబసభ్యులతో వచ్చింది. 27వ తేదీన వైద్యులు శస్త్రచికిత్స చేయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి తల్లీబిడ్డకు వార్డులో చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో గుర్తుతెలియని మహిళ విజయ వద్దకు వెళ్లింది. టీకా వేయించుకొస్తానని తల్లిని నమ్మించి శిశువును తీసుకెళ్లింది. కొద్ది సేపటి తర్వాత భర్త నరి, అత్త చాంది వచ్చి పాప ఏదని అడగగా… టీకాలు వేయించుకొస్తానని ఓ మహిళ తీసుకెళ్లిందని విజయ చెప్పింది. ఎంతసేపైనా శిశువును తీసుకొని ఆమె రాకపోవడంతో ఆందోళన చెంది ఆస్పత్రి అంతా వెతికారు. పాప జాడ తెలియకపోవడంతో గుర్తుతెలియని మహిళ కిడ్నాప్‌ చేసిందని సుల్తాన్‌ బజార్‌ పోలీసులకు, డయల్‌ 100కు సమాచారం ఇచ్చాడు.
 ఇన్‌స్పెక్టర్‌ శివశంకర్‌, ఎస్‌ఐ నరేష్‌ కుమార్‌ ఆస్పత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీసి సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. ఓ మహిళ శిశువును ఎత్తుకొని బయటకు వెళ్తున్న ఫుటేజీ లభించింది. సుల్తాన్‌ బజార్‌ పరిసర ప్రాంతాలు, చౌరస్తాల్లోగల కెమెరాల ఫుటేజీ కూడా సేకరించారు. ఓ మహిళ శిశువును తీసుకొని ఆటోలో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు వెళ్తున్నట్టు గుర్తించారు. బస్‌స్టేషన్‌లో కెమెరాలను పరిశీలించగా బీదర్‌ బస్సులు బయలుదేరే ప్లాట్‌ ఫాం నెంబర్‌ 50 వద్ద ఆమె బస్సు కోసం ఎదురు చూస్తున్న ఫుటేజీ లభించింది. మరో ఫుటేజీలో ఆమె బీదర్‌ బస్సు ఎక్కినట్టు గుర్తించారు. బస్‌స్టేషన్‌ కంట్రోలర్‌ను అడగగా ఆ బస్సు బీదర్‌ బయల్దేరిందని చెప్పారు. డ్రైవర్‌, కండకర్‌ ఫోన్‌ నెంబర్లను పోలీసులు తీసుకొని శిశువును కిడ్నాప్‌ చేసిన మహిళ ఫొటోలను ఫోన్‌లో చూపించగా.. బీదర్‌కు కొద్ది దూరంలో గల చౌరస్తాలో బస్సు దిగిందని కండక్టర్‌ పోలీసులకు చెప్పాడు. డీసీపీ రమేష్‌, ఏసీపీ డాక్టర్‌ చేతన ఆధ్వర్యంలో 8 బృందాలను ఏర్పాటు చేశారు. అక్కడి పోలీసులను అప్రమత్తం చేసి నిందితురాలి ఫొటోలను వారికి వాట్సా్‌పలో పంపించారు.
తెలంగాణ పోలీసులతో కలిసి సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం 7 గంటల వరకు బీదర్‌లో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఇళ్లు, హోటళ్లు, లాడ్జీలు, ప్రధాన మార్కెట్‌లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో జల్లెడ పట్టినా శిశువు జాడ కనిపించలేదు. అక్కడి మీడియాలో ఫొటోలను ప్రచురింపజేశారు. 8.30 గంటల సమయంలో బ్లూరంగు చీర ధరించిన మహిళ పాపను తీసుకొని ఆటోలో వెళ్లినట్టు డ్రైవర్లు చెప్పారు. ఆ ఆటోలో ప్రయాణించిన మహిళ కిడ్నాపర్‌ కాదని తేలింది. పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలుసుకున్న ఆమె శిశువును ప్రభుత్వ ఆస్పత్రిలో వరండాలో పడుకోబెట్టి పారిపోయింది. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని శిశువును గుర్తించారు. ఏసీపీ చేతన కంప్యూటర్‌లో స్కైప్‌ ద్వారా శిశువును తల్లిదండ్రులకు చూపించగా… తమ పాపే అని గుర్తించారు. శిశువు బీదర్‌లో ఉందని తెలియడంతో సుల్తాన్‌బజార్‌ పోలీసులు, ఏసీపీతోపాటు పాప అమ్మమ్మ చాంది, నానమ్మ, తండ్రి అక్కడికి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *