శిశువులు అపహరణకు గురికాకుండా సరికొత్త రక్షణ వ్యవస్థ

May 15, 2021

రెండేళ్ల కిందట విజయవాడ పాత ఆసుపత్రిలోని మాతాశిశు విభాగంలో నవజాత శిశువును ఓ మహిళ అపహరించుకుపోయింది. అప్పట్లో సంచలనమైన ఈ సంఘటన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లింది. సీఎం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అపహరణకు గురైన శిశువును 24 గంటల్లో వెతికి పట్టుకుని తల్లి ఒడికి చేర్చాలని అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగం ఉరుకులు, పరుగులు తీసి ఎట్టకేలకు శిశువును గుర్తించారు.
సరికొత్త రక్షణ వ్యవస్థ
నవజాత శిశువులకు మరింత భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఐఎఫ్‌డీ) పేరుతో సరికొత్త రక్షణ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. తొలివిడతగా రాష్ట్రంలో అన్ని టీచింగ్‌ ఆసుపత్రుల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలోని ప్రభుత్వ పాత ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో మంగళవారం ఈ ఆర్‌ఎఫ్‌ఐడీ సిస్టమ్‌ను రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు ఎన్‌.సుబ్బారావు ప్రారంభించారు. దశలవారీగా మిగిలిన జిల్లా ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఆర్‌ఎఫ్‌ఐడీ పనితీరు ఇలా..
కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణుల వివరాలను ముందు ఆసుపత్రి సిబ్బంది కేస్‌ షీట్‌లో నమోదు చేస్తారు. గర్భిణులకు కాన్పు సమయం దగ్గర పడినప్పుడు, లేబర్‌ రూమ్‌కు తీసుకువెళ్లే ముందు ఆసుపత్రి సిబ్బంది ఆ గర్భిణీకి ఇచ్చిన రిజిస్టర్‌ నంబరుతో సహా ఆమె ఫొటో, వివరాలను ఆర్‌ఎఫ్‌ఐడీ సిబ్బంది కంప్యూటర్‌లో నమోదు చేస్తారు. డెలివరీ అయ్యాక పుట్టింది మగశిశువా లేక ఆడశిశువా అనేది తెలిసిన తర్వాత వెంటనే ఆ తల్లీబిడ్డలకు అంతకుముందే కంప్యూటర్‌లో నమోదు చేసిన సమాచారంతో (ఎలక్ట్రికల్లీ స్టోర్డ్‌ ఇన్ఫర్మేషన్‌) కూడిన ట్రాకింగ్‌ ట్యాగ్‌లను తల్లీ, బిడ్డలకు కడతారు. ఆసుపత్రి సిబ్బందికి, వైద్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆ తల్లీబిడ్డలు బయటకు వెళ్లినా లేదా ఎవరైనా అపహరించినా ఆసుపత్రి ద్వారం వద్ద ఏర్పాటుచేసిన సెన్సార్లు వార్నింగ్‌ బెల్స్‌ను మోగిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *