వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌

May 15, 2021

నేటి తరంలో వాట్సాప్‌ వాడకం చాలా అవసరమనేది అందరికీ తెలిసిన అంశమే. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ వేత్తలతో పాటు ప్రభుత్వ శాఖలన్నీ వా ట్సాప్‌ ద్వారా సందేశాలు ఇచ్చి పుచ్చుకోవడం తెలిసిందే. అలాంటి సమయంలోనే స్నేహితులు, సంబంధీకులు, ఇతర పరిచయాల ద్వారా కూడా వాట్సాప్‌ మెసేజ్‌లు వచ్చి వెళుతుంటాయి. దీంతో పాటు అందరినీ కలుపుతూ గ్రూప్‌లు తయారు చేయడం కూడా వాట్సాప్‌ వినియోగంలో ఓ భాగమే.
స్టోరేజ్‌ నిండిపోవడం..
సమస్యల్లా గ్రూప్‌లో ఉన్న సభ్యులతోనే. అందులో అందరికీ అన్ని విషయాలపై అవగాహన ఉండవచ్చు.. ఉండకపోవచ్చు. ఏదో తమ కు నచ్చితే ఇతరులకు నచ్చాలని రూల్‌ కూడా లేదు. అయినా కొంతమంది అదే పనిగా తమకు వచ్చిన మెసేజ్‌లన్నీ ఇతర గ్రూప్‌లలో పోస్టు లు పెడుతూ చికాకు కలిగిస్తుంటారు. స్మార్ట్‌ ఫోన్లలో మెసేజ్‌ రాగానే టోన్‌ నుంచి ప్రారంభమై దాన్ని జమ చేసుకుంటూ స్టోరేజ్‌ నిండిపోవడం.. బ్యాటరీ తగ్గిపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు.
 త్వరలోనే కొత్త ఫీచర్‌..
వాట్సాప్‌ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్‌ అడ్మిన్‌లతో పాటు గ్రూపు సభ్యులకు కాస్త ఊరటనిస్తోంది. ఇక ముందు గ్రూప్‌ను అడ్మిన్‌ పూర్తిగా తన ఆధీనంలో పెట్టుకునే అవకాశం ఉంది. సభ్యుల నుంచి ఇబ్బందులు రాకుండా గ్రూప్‌లో ఇష్టమొచ్చినట్లు పోస్ట్‌ చేయడం ఆపి ఉంచే అవకాశముంటుంది. గ్రూప్‌లో పోస్ట్‌ చేయాలంటే ముందు అడ్మిన్‌కు పంపి.. ఆ తర్వాత అడ్మిన్‌ దాన్ని పోస్ట్‌చేసే అవకాశముంది. దీంతో సభ్యులకు కాస్త ఊరట లభిస్తుంది. గ్రూప్‌లో ఇష్టమొచ్చిన రీతిలో వ్యవహరించే సభ్యులను మాత్రమే కట్టడి చేసే ఫీచర్‌ త్వరలోనే రానున్నట్లు సమాచారం.
అవగాహన సరిగా లేని సభ్యుల వల్ల గ్రూపులు తయారు చేసిన అడ్మిన్‌లకూ సమస్యలు తప్పడం లేదు. ఇతరులను కించపరచడం, మనోభావాలు దెబ్బతీయడంతో పాటు వివిధ కారణాలతో వాట్సాప్‌ సందేశాలు పోలీస్‌ కేసుల వరకు వెళుతున్నాయి. దీంతో చాలా చోట్ల మెంబర్‌తో పాటు గ్రూప్‌ అడ్మిన్లకు కూడా సమస్యలు తప్పడం లేదు. అలాంటి సభ్యున్ని తొలగించినా మరో చోట లేదా మరో నెంబర్‌తో గ్రూప్‌లో చేరే అవకాశముంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *