రోహిత్ శర్మ సెంచరీ

May 14, 2021

టీ20ల్లో టీమిండియా దూసుకెళ్తూనే ఉంది. వ‌రుస‌గా ఆరో టీ20 సిరీస్‌ను కోహ్లి సేన త‌న ఖాతాలో వేసుకుంది. ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడో టీ20లో 7 వికెట్ల‌తో గెలిచి.. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో 199 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని మ‌రో 8 బంతులు మిగిలుండ‌గానే సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో సెంచ‌రీతోపాటు టీ20ల్లో 2 వేల ప‌రుగుల మైలురాయిని కూడా రోహిత్ అందుకోవ‌డం విశేషం. అత‌డు కేవ‌లం 56 బంతుల్లోనే టీ20ల్లో మూడో సెంచ‌రీ చేశాడు. టీ20ల్లో మూడు సెంచ‌రీలు చేసిన రెండో బ్యాట్స్‌మ‌న్ రోహిత్‌శ‌ర్మ‌. అత‌ను గ‌తంలో సౌతాఫ్రికా, శ్రీలంక‌ల‌పై సెంచ‌రీలు చేశాడు. ఈ మ్యాచ్‌లో అత‌నికి కెప్టెన్ విరాట్ కోహ్లి (29 బంతుల్లో 43) చ‌క్క‌ని స‌హ‌కారం అందించాడు. ఇద్ద‌రూ క‌లిసి మూడో వికెట్‌కు 89 ప‌రుగులు జోడించారు. రోహిత్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్స‌ర్లున్నాయి. చివ‌ర్లో హార్దిక్ పాండ్యా కేవ‌లం 14 బంతుల్లో 33 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంత‌కుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 198 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ఓపెన‌ర్ జేస‌న్ రాయ్ కేవ‌లం 31 బంతుల్లోనే 67 ప‌రుగులు చేశాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు, 4 ఫోర్లు ఉన్నాయి. మ‌రో ఓపెన‌ర్ బ‌ట్ల‌ర్ 34, హేల్స్ 30, బెయిర్‌స్టో 25 ప‌రుగులు చేశారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొద‌టి మ్యాచ్ టీమిండియా గెల‌వ‌గా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ సిరీస్‌కు ముందు ఐర్లాండ్‌, సౌతాఫ్రికా, శ్రీలంక‌, న్యూజిలాండ్‌ల‌తో జ‌రిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల‌తోపాటు శ్రీలంక‌, బంగ్లాదేశ్‌ల‌తో జ‌రిగిన ట్రై సిరీస్‌ను కూడా టీమిండియా గెలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *