మూడు నెలల్లో…తెలుగుపై పట్టు!

May 14, 2021

లక్నో స్వస్థలం… హిందీ మాతృభాష. 
చదువుకుందీ.. ఐఏఎస్‌ పరీక్ష రాసిందీ మాతృభాషలోనే! 
తెలుగు మూలాలు ఏ మాత్రం పరిచయం లేవామెకు. 
కానీ ఇప్పుడు… తెలుగులో గలగలా మాట్లాడుతుంది.. చకచకా రాయగలుగుతుంది. 

భద్రాద్రి- కొత్తగూడెం అసిస్టెంట్‌ కలెక్టర్‌గా మూణ్నెల్ల క్రితం బాధ్యతలు తీసుకున్న ఇలా త్రిపాఠి జనంలో మమేకం అవ్వాలనీ.. వారి భాధలూ, భావాలూ అర్థం చేసుకోవాలని తెలుగు చదవడం, రాయడం మూడు నెలల్లో నేర్చుకుంది.
2016లో సివిల్స్‌లో 51 ర్యాంకు సాధించిన ఇలా ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. కేవలం ఇంట్లో ఉండే చదువుకుంది. మూడు నెలల క్రితం అసిస్టెంట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న ఆమె అక్కడి సిబ్బందికి తెలుగులోనే పనులు అప్పజెబుతుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ‘నిజానికి ఇలా తెలుగు భాష నేర్చుకోవడానికి కారణం మా నాన్నే. ఎందుకంటే ఐఏఎస్‌గా సమర్థంగా బాధ్యతలు నిర్వహించాలంటే అక్కడి ప్రజలతో మమేకం కావాలి. వాళ్ల సమస్యల్ని అర్థం చేసుకుని అండగా నిలవాలి. అందుకు ప్రజలు మాట్లాడే భాష రావాలి అని నాన్న ఎప్పుడూ అంటూంటారు. ఆ మాటలే నన్ను తెలుగు నేర్చుకునేలా చేశాయి’ అంటోన్న ఇలా ఇంకా తెలుగు మీద పట్టు తెచ్చుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేనా అనర్గళంగా తెలుగులో మాట్లాడి.. చక్కటి తెలుగు సాహిత్యం చదివి అర్థం చేసుకోవాలనుకుంటోంది. వచ్చే ఏడాది మేలో తమ బ్యాచ్‌ ఐఏఎస్‌ సహచరులతో కలిసి మళ్లీ ముస్సోరీ వెళ్లే నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటోందామె.
ఎలా నేర్చుకుందంటే..: ముస్సోరి అకాడమీలోనే తెలుగు భాష ఆమెకి పరిచయమైంది. అక్కడే నేర్చుకునే ప్రయత్నం చేసింది. భద్రాద్రి-కొత్తగూడెంలో విధుల్లో చేరాక చుట్టు పక్కల వారు మాట్లాడుతుంటే తెలుగు పదాలు వింటూ వాటిని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేసింది. తప్పులు దొర్లితే నవ్వుకోకుండా.. సరిదిద్దమని సిబ్బందినీ కోరింది. రోజుకు తప్పకుండా మూడు నాలుగు కొత్త పదాలు నేర్చుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎవరు మాట్లాడినా శ్రద్ధగా వినడం అలవాటు చేసుకుంది. అలా భాష మీద అవగాహన తెచ్చుకుంది. ప్రస్తుతం ఓ టీచర్‌ని నియమించుకుని రోజుకు గంట సాధన చేస్తోంది. టీవీలో తెలుగు కార్యక్రమాలు చూస్తుంటుంది. ‘మావారు భవేశ్‌ మిశ్రా భద్రాచలం సబ్‌కలెక్టర్‌. దాంతో ఇద్దరం ఇంట్లో తెలుగు మాట్లాడుతూ సాధన చేస్తుంటాం. అలానే అధికారిణిగా నాకు ప్రజలు మాట్లాడే భాష రానప్పుడు.. వాళ్లు నావద్దకు వచ్చి సమస్యలేం చెప్పుకుంటారు. అవి నాకెలా తెలుస్తాయి. నేనిప్పుడు బయటకు వెళ్లి వాళ్లని తెలుగులో పలకరిస్తున్నా కాబట్టే సమస్యలు తెలుస్తున్నాయి’ అంటారామె.

– జ్యోతి ప్రసాద్‌, ఈనాడు హైదరాబాద్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *