గుంటూరులో తప్పించుకుని.. యాదాద్రిలో పట్టుబడ్డ ఖైదీ

May 15, 2021

జీవిత ఖైదీ శిక్ష పడిన వ్యక్తి గుంటూరు జిల్లా కోర్టు నుంచి తప్పించుకోగా యాదగిరిగుట్ట పోలీసులకు గురువారం పట్టుబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుంటూరు జిల్లా దుర్గి మండలం కొలగట్ల గ్రామానికి చెందిన బత్తుల పూర్ణయ్య(38) 2012లో ఓ మర్డర్‌ కేసులో ఏ-3 నిందితుడు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు కలవర వీరగోవింద్‌, బండి గోపయ్యలతో పాటు ఈ నెల 4న కేసు ఫైనల్‌ ఇయరింగ్‌కు గుంటూరు జిల్లా టెన్త్‌ అడీషనల్‌ కోర్టుకు తరలించారు. కాగా ఈ ముగ్గురు నిందితులకు ఎక్స్‌ఫ్లోజివ్స్‌ అండ్‌ సబ్‌ స్టాండ్స్‌ చట్టం ప్రకారం జీవిత ఖైదీలుగా కోర్టు నిర్దారించింది. అయితే శిక్షను అమలు చేసేందుకు అక్కడి పోలీసులు కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న క్రమంలో పోలీసుల కళ్లు గప్పి నిందితుడు పూర్ణయ్య చాకచాక్యంగా తప్పించుకున్నాడు. అక్కడి నుంచి యాదగిరిగుట్టకు చేరుకున్నట్లు డీఎస్పీ గిరిధర్‌ సమాచారం ఇవ్వడంతో యాదగిరిగుట్ట సీఐ అశోక్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు పట్టణంలో గాలించారు. గురువారం సాయంత్రం పట్టణంలోని మార్కెట్‌ యార్డు సమీపంలో నిందితుడు ఉన్నాడనే పక్కా సమాచారంతో గాలించగా నిందితుడిని గుర్తించి పోలీసులు పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్టు సీఐ అశోక్‌ కుమార్‌ తెలిపారు. ఈమేరకు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *