కూలిన వారసత్వ బస్టాండు

May 13, 2021

మహానగరానికి పేగుబంధంగా నిలిచిన గౌలిగూడ బస్టాండ్‌ గురువారం నిలువునా కూలిపోయింది. 1951 నుంచి 1994 వరకు హైదరాబాద్‌ సెంట్రల్‌ బస్‌ స్టేషన్‌ (సీబీఎస్‌)గా, గతనెల వరకు సిటీ బస్‌ స్టేషన్‌గా సేవలు అందించిన నిజాం కాలం నాటి వారసత్వ కట్టడం చరిత్ర పుటల్లో కలిసిపోయింది. గౌలిగూడ బస్టాండ్‌ పేరు వినగానే నగర పౌరుడి స్మృతిపథంలో తళుక్కున మెరిసే జిప్సం రేకుల గుమ్మటం శాశ్వతంగా కనుమరుగై పోయింది.

నిజాం కాలం నాటిది..

సీబీఎస్‌ డోమ్‌ పతనానికి గత నెలే రంగం సిద్ధమైంది. జూన్‌ 30 నుంచి సిటీ సర్వీసుల రాకపోకలు నిలిపేశారు. రెండు గేట్లు మూసివేశారు. డోమ్‌కు బిగించిన ఇనుప బొల్టులు తుప్పు పట్టాయని, కూలి ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని గుర్తించి బస్సుల రాకపోకలను నిలిపేశామని, షాపులను ఖాళీ చేయించామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. గురువారం ఉదయం గుమ్మటం పెద్ద శబ్దంతో కుప్పకూలిపోయింది. లోపల ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. 1930లో నిజాం కాలంలో దీన్ని విమానాల హ్యాంగర్‌గా నిర్మించారు. స్వతంత్ర భారతావనిలో హైదరాబాద్‌ భాగమయ్యాక 1951లో హ్యాంగర్‌ను ఆర్టీసీ అధీనంలోకి తీసుకుంది. 1994లో మూసీ మధ్యలో ఎంజీబీఎస్‌ నిర్మించే వరకు హైదరాబాద్‌ సెంట్రల్‌ బస్టాండ్‌గా ఉమ్మడి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే బస్సులకు గమ్యస్థానమైంది. ఆ తర్వాత కూడా 2006 వరకు జిల్లాల బస్సులు సీబీఎస్‌ డోమ్‌లోకి జిల్లాల బస్సులు వచ్చేవి. పన్నెండేళ్లుగా కేవలం సిటీ బస్‌స్టేషన్‌గా సేవలు అందిస్తోంది. రోజూ సీబీఎస్‌ నుంచి 85 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.

1930లో నిర్మాణం..

నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1930లోనే బేగంపేటలో విమానాశ్రయాన్ని నెలకొల్పారు. తమ కుటుంబ సభ్యులతో పాటు బంధు మిత్రులు తిరగడానికి ప్రత్యేక విమానాలు సమకూర్చారు. సొంత ఎయిర్‌ క్రాఫ్ట్‌ నిర్వహణ, మరమ్మతుల కోసం 1930లో ప్రత్యేకంగా హ్యాంగర్‌ను నిర్మించారు. మూసీ ఒడ్డున పదెకరాల ఖాళీ స్థలంలో బ్రిటీష్‌ ఇంజనీర్ల సహకారంతో ఇంగ్లండ్‌ నుంచి జింక్‌ షీట్లు దిగుమతి చేసుకొని మిసిసిపీ హ్యాంగర్‌ నిర్మించారు. 350 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, 60 అడుగుల ఎత్తులో (డోమ్‌) హ్యాంగర్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. నిజాం ప్యాలెస్ కు సమీపంలో విమానం అందుబాటులో ఉండేందుకు హ్యాంగర్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. 1932లో నిజాం స్టేట్‌ రైల్వే రోడ్‌ ట్రాన్స్‌పోర్టు సంస్థను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌ నుంచి మచిలీపట్నం, మైసూరు లాంటి దూర ప్రాంతాల ప్రయాణానికి మిసిమిసీ హ్యాంగర్‌ పక్కనే 27 బస్సులతో నిజాం స్టేట్‌ తొలి బస్‌డిపో(గౌలిగూడ డిపో)ను ఏర్పాటు చేయించారు. బేగంపేట విమానాశ్రయం టెర్మినల్స్‌ నిర్మాణం పూర్తయ్యాక విమానాలను అక్కడికి శాశ్వతంగా తరలించారు. గౌలిగూడలోని మిసిసిపీ హ్యాంగర్‌ ఖాళీ అయ్యింది. హ్యాంగర్‌ ముందుభాగంలో ఉన్న గౌలిగూడ బస్‌స్టేషన్‌ను హ్యాంగర్‌ లోపలికి తరలించారు. వెనుకభాగాన్ని బస్‌ డిపో నిర్వహణ కోసం వినియోగించారు. 1958లో ఆర్టీసీ ఏపీఎ్‌సఆర్టీసీగా మారడంతో గౌలిగూడ మినిసిపీ హ్యాంగర్‌ రాష్ట్ర స్థాయి ప్రధాన బస్‌స్టేషన్‌గా అవతరించింది. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు బస్సుల రద్దీ పెరగడంతో సీబీఎస్‌ పక్కనే మూసీ నదిలోని పాతిక ఎకరాల పార్కులో ఆధునిక బస్‌స్టేషన్‌ ఎంజీబీఎ్‌సను నిర్మించారు. మూసీపై గౌలిగూడ, కాలీఖబర్‌ల వైపు రెండు వంతెనలు నిర్మించి ఎంజీబీఎస్ కు రాకపోకలకు ఏర్పాటుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *