కత్తి పై బహిష్కరణ వేటేనా..?

May 15, 2021

గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై హైదరాబాద్‌ పోలీసులు నగర బహిష్కరణ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్‌ నగరానికి రాకూడదంటూ ఆదేశాలు జారీచేశారు. దీనిపై తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌తో పాటు డీసీపీలు, ఉన్నతాధికారులతో డీజీపీ సమావేశమయ్యారు. కత్తి మహేశ్‌ ఇటీవల శ్రీరాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, దానిపై హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్త చేయడం అంశాలపై డీజీపీ చర్చించారు. సమాజంలో అలజడులు సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్న కత్తి మహేశ్‌ నగరంలో ఉండటానికి అనర్హుడంటూ ఈ సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

శ్రీరాముడిపై కత్తి మహేశ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామి ఈరోజు చౌటుప్పల్‌ నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. దీనిపై హిందువులదంరూ మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే పరిపూర్ణానంద పాదయాత్రకు రాచకొండ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయన బయటకు రాకుండా జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలోనే గృహ నిర్బంధం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *