ఏపీఎస్‌సీ స్కాం..బిజెపి ఎంపి కుమార్తె అరెస్టు

May 14, 2021

అస్సాం బీజేపీ ఎంపీ ఆర్‌పీ శర్మ కుమార్తె పల్లవితో సహా 19 మందిని అస్సాం అధికారులను బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2016లో జరిగిన అస్సాం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీఎస్‌సీ) పరీక్షలో సమాధాన పత్రాలతో వారి చేతిరాత సరిపోలకపోవడంతోనే అరెస్టుల పర్వం మొదలైంది.

ఏపీఎస్‌సీలో ఉద్యోగాల కొనుగోలు కుంభకోణాన్ని విచారిస్తున్న దిబ్రూగర్‌ పోలీసులు అస్సాం సివిల్‌ సర్వీస్‌, అస్సాం పోలీస్‌ సర్వీస్‌, ఇతర ప్రభుత్వ అధికారులు 19 మందికి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరి ఆన్సర్‌ షీట్లు, వీరి చేతిరాత ఒకేరకంగా లేదని గుర్తించారు. ఫోరెన్సిక్‌ పరీక్షల్లో వెల్లడైన ఫలితాల ఆధారంగా వీరిని గువహటిలో అరెస్ట్‌ చేశామని దిబ్రూగర్‌ ఎస్పీ గౌతం బోరా తెలిపారు. ఏపీఎస్‌సీ పరీక్షల అనంతరం రాకేష్‌ పాల్‌ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఈ 19 మంది అధికారులు ప్రభుత్వ సర్వీసుల్లోకి ఎంపికయ్యారు.

ఈ కుంభకోణంలో పాల్‌ సహా మరో ముగ్గురు అధికారులను గతంలో అరెస్ట్‌ చేశారు. కాగా, ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించి అరెస్ట్‌ అయిన 13 మంది అధికారులను అస్సాం ప్రభుత్వం జూన్‌ 21న ఉద్యోగాల నుంచి తొలగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *