ఆపరేషన్ థాయ్ లో భారతీయులు

May 14, 2021

థామ్‌ లువాంగ్‌ గుహలో చిక్కుకున్న ఫుట్‌బాల్‌ టీమ్‌లోని చివరి ఐదుగురిని సహాయక బృందాలు మంగళవారం క్షేమంగా బయటకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అసాధ్యమైన ఈ ఆపరేషన్‌ పూర్తి చేయడానికి ప్రాణాలకు తెగించి పోరాడిన డైవర్లు, సహాయ‍క సిబ్బందికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే చిన్నారులను సురక్షితంగా బయటికి తీసుకురావడంలో థాయ్‌లాండ్‌ ప్రభుత్వంతో పాటు పలువురు ప్రముఖులు, వివిధ దేశాల పాత్ర కూడా ఉంది. కేవలం పిల్లలను కాపాడేందుకే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలన్‌ మస్క్‌ ఏకంగా ఓ చిన్నపాటి జలాంతర్గామిని తయారు చేయించి పంపగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. అత్యంత దుర్భేద్యమైనదిగా భావించిన ఈ ఆపరేషన్‌లో భారత్‌ కూడా ప్రముఖ పాత్ర పోషించింది.

నీటిని తోడటంలో ప్రముఖ పాత్ర…
థామ్‌ లువాంగ్‌ గుహలో చిన్నారులు చిక్కుకున్న విషయం గురించి తెలుసుకున్న భారత రాయబార కార్యాలయం తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. పుణెకు చెందిన కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ లిమిటెడ్‌(కేబీఎల్‌)కు చెందిన సాంకేతిక నిపుణుల సాయం తీసుకోవాల్సిందిగా థాయ్‌ అధికారులకు సిఫారసు చేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన కేబీఎల్‌ సాంకేతిక నిపుణులు థామ్‌ లువాంగ్‌కు చేరుకున్నారు. నీటిని తోడేందుకు ఉపయోగించే పంపుల పనితీరును పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వాటి కండీషన్‌ గురించి పరిశీలించారు. నీటిని త్వరిగతిన తోడేందుకు నాలుగు అత్యాధునిక ‘ఆటోప్రైమ్‌ డీవాటరింగ్‌’ పంపులను కూడా థాయ్‌లాండ్‌కు పంపించేందుకు మహారాష్ట్రలోని కిర్లోస్‌వాడి ప్లాంట్‌లో సిద్ధంగా ఉంచినట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. చిన్నారులంతా సురక్షితంగా బయటపడటంలో తమ వంతు సహకారం కూడా ఉన్నందుకు సంతోషిస్తున్నామని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *